ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలు క్రమబద్ధీకరించాలి.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
మైస ఉపేందర్ మాదిగ
హన్మకొండ,అక్టోబర్24(తెలంగాణముచట్లు):
ప్రజలకు నిరంతరం వైద్య సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, వేతనాల పెంపు, ప్రసూతి సెలవులు వంటి న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
గత పదేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయకపోవడం, పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అందించడంతోపాటు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో చేపట్టిన తరహాలో తెలంగాణలోనూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు.
జీవో 1195 కారణంగా వేతనాలు తగ్గిన ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆరోగ్యశాఖ అధికారులు ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని మైస ఉపేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Comments