మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్.
వనపర్తి,అక్టోబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుని, కులం పేరుతో దూషించారనే ఆరోపణలపై బాధితుడు మాసాని సుధీర్‌కు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం ప్రకారం నేరాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. బాధితుడికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ తదితర నాయకులు మాట్లాడుతూ కులవివక్ష రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అన్ని రాజకీయ పార్టీలు, దళిత, గిరిజన, బహుజన సంఘాలతో కలిసి వనపర్తి జిల్లా కేంద్రంలో చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు, బాధితుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


Comments