కరీంనగర్‌ అభివృద్ధికి భారీ ప్రణాళిక.

కరీంనగర్‌ అభివృద్ధికి భారీ ప్రణాళిక.

*నగరాభివృద్ధికి పెద్దపీట.. రూ.840 కోట్ల పనులకు త్వరలో శ్రీకారం.*

*2, 8వ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు మేయర్‌ శ్రీకారం.*

*రూ.40.70 లక్షలతో సరస్వతినగర్‌లో డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ.*

*నీటిని పొదుపుగా వాడాలి.ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి: మేయర్‌ కొలగాని శ్రీనివాస్.*

కరీంనగర్, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని 2, 8వ డివిజన్లలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2వ డివిజన్‌ సరస్వతినగర్‌లో యూడీఐఎఫ్‌ నిధులు రూ.40.70 లక్షలతో చేపట్టనున్న ఆర్‌సీసీ పైపులైన్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం డివిజన్‌ వాసులు మేయర్‌కు ఘనస్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సత్కరించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు.

*అలుగునూరులో అభివృద్ధి కార్యక్రమాలు.*

అనంతరం 8వ డివిజన్‌ అలుగునూరులో మేయర్‌ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వరంగల్‌ రోడ్డు, హైదరాబాద్‌ చేపలకాలనీ ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్‌ కాల్వ మల్లేషంతో కలిసి ప్రజల అవసరాల కోసం వారసంత మార్కెట్లను ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ వద్ద నిర్మాణ పనులతో పాటు బస్‌ షెల్టర్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లలో యూసీఎఫ్‌కు చెందిన రూ.50 కోట్ల నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా కాంట్రాక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.

*రూ.840 కోట్లతో నగరాభివృద్ధి పనులు.*

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ కింద కరీంనగర్‌ నగరపాలక సంస్థకు రూ.840 కోట్ల నిధులు సమకూరినట్లు మేయర్‌ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు ఇటీవల ఆమోదం లభించిందని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుల అమలుతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

*వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు.*

నగరంలో వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు మేయర్‌ తెలిపారు. 66వ డివిజన్‌ పరిధిలో జంతు జనన నియంత్రణ (ఏబీసీ) కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, అవసరమైన సదుపాయాలు, సామర్థ్యం పెంపునకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. స్మార్ట్‌ సిటీ నిధుల కింద సుమారు రూ.2 కోట్లతో ఏబీసీ కేంద్రానికి సంబంధించిన పనుల టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

8వ డివిజన్‌లో ప్రారంభించిన రెండు వారసంత మార్కెట్లు స్థానిక ప్రజలకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీలకు తాగునీటి సదుపాయాలు కల్పించడంలో భాగంగా అలుగునూరులో బోర్‌వెల్స్‌ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ సహకారంతో మంజూరైన బోర్‌వెల్స్‌ పనులు చేపడుతున్నామని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

*నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి.*

రానున్న వేసవిని, ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలు ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు. అవసరమైన మేరకే నీటిని వాడుకోవాలని, వృథాను అరికట్టాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని కోరారు. భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హానికరమని మేయర్‌ పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, వాటి వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


IMG-20261025-WA0021

నగరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ఐ అరుణ్.
స్టేషన్ ఘన్ పూర్,అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):  స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అరుణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్ఐ...
మంగంపల్లి ఘటనపై ఎమ్మార్పీఎస్ రౌండ్ టేబుల్ సమావేశం.
అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
విద్యార్థి ప్రతిభకు ఎమ్మెల్యే ఆర్థిక ప్రోత్సాహం.
హుజురాబాద్‌లో వ్యవసాయ మోటార్ చోరీ.
ముప్పారం–వేములవాడకు నూతన బస్సు సర్వీసు ప్రారంభం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.