గుల్లెపెల్లి నవ్యశ్రీకి పద్మశాలి ప్రతిభా పురస్కారం.
తెలంగాణ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు సాధించిన నవ్యశ్రీ.
పర్వతగిరి, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (పోపా), వరంగల్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లోని శివనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఈసెట్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ) విభాగంలో రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు సాధించిన వరంగల్‌లోని కాశీబుగ్గకు చెందిన గుల్లెపెల్లి శివకుమార్, పల్లవి దంపతుల కుమార్తె గుల్లెపెల్లి నవ్యశ్రీకి ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, పోపా వరంగల్ అసోసియేట్ అధ్యక్షుడు మాటేటి సంతోష్‌తో పాటు పాలకవర్గ సభ్యులు నవ్యశ్రీకి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు.ప్రతిభా పురస్కారం తనకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని నవ్యశ్రీ పేర్కొంటూ, అవార్డును అందించిన పోపా వరంగల్ ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.


Comments