పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి.
నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలి
జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శాగంటి మణి పిలుపు
చిల్పూర్, అక్టోబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శాగంటి మణి పిలుపునిచ్చారు. చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పట్టభద్రులు ఓటరు నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 నవంబర్‌కు ముందు డిగ్రీ లేదా సంబంధిత అర్హత కలిగిన విద్యను పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం అవసరమని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలు:
* ఆధార్ కార్డు
* ఓటరు గుర్తింపు కార్డు వివరాలు
* డిగ్రీ మెమో లేదా విద్యార్హత ధ్రువపత్రం
* పాస్‌పోర్టు సైజు ఫొటో
* మొబైల్ నంబర్
అర్హులైన పట్టభద్రులు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నమోదు ప్రక్రియపై సందేహాలుంటే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారాల కోసం కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ప్రాధాన్యత కలిగి ఉంటుందని శాగంటి మణి అన్నారు. పట్టభద్రులందరూ రాజకీయ చైతన్యంతో ముందుకు వచ్చి ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.


Comments