ఇందిరమ్మ ఇళ్లలో అనర్హులకు చోటు.. కన్నారం గ్రామస్థుల ఆందోళన.
వేలేరు, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై వివాదం నెలకొంది. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయకుండా, వ్యవసాయ భూములు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నవారికి కేటాయించారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
సొంత ఇళ్లు లేక కొందరు కమిటీ హాల్‌లో నివసిస్తున్నారని, అయినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు.
వెంటనే గ్రామసభ నిర్వహించి అర్హుల జాబితాను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇచ్చులపల్లి వార్డుకు కూడా ఒక్క ఇల్లు మంజూరు కాలేదని అక్కడి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థుల ఆరోపణలపై సంబంధిత అధికారులు, సర్పంచ్ స్పందించాల్సి ఉంది.


Comments