ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు.
గత పదేళ్ల అభివృద్ధి.. ప్రస్తుత మూడేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం.
వేలేరు, అక్టోబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఆయనపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మల్లికుదుర్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సమావేశమై మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బిల్లా యాదగిరి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకుడు రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో వేలేరు మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశారని, ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. త్వరలోనే కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. అలాగే ప్రతి గ్రామానికి బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత మూడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గత పాలన, ప్రస్తుత పాలనలోని అభివృద్ధి పనులు, పాలనా విధానాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాజు, దయాకర్, రాజు యాదవ్, భగవాన్, రవి, అంజయ్య, ఐలయ్య, రాకేష్ రెడ్డి, చిరంజీవి, రజినీకాంత్ యాదవ్, సురేష్, సారయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments