గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు.
పెద్దమందడి,అక్టోబర్24(తెలంగాణ ముచ్చట్లు):
గుడిపల్లి రిజర్వాయర్‌ను జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, పెద్దమందడి మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. రిజర్వాయర్‌లోని మూడు పంపులను నిరంతరాయంగా నడిపించి, సాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కేఎల్ఐ పంపుల ద్వారా వెల్టూరు, మదిగట్ల, అమ్మపల్లి, అలువాల, చిన్నమందడి, పామిరెడ్డిపల్లి గ్రామాలకు నిరంతరాయంగా సాగునీరు అందించాలని నాయకులు కోరారు. ముఖ్యంగా ఎల్లూరు పంపులను నిరంతరాయంగా నడిపించి, చివరి దశలో ఉన్న పంటలకు నీరందించాలని సూచించారు. నార్లాపూర్ లిఫ్టింగ్ స్కీమ్ నుంచి కేఎల్ఐ కాలువలకు నీటిని అందించే వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రాబోయే వేసవిలో సాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పంటలు చేతికొచ్చే వరకు చివరి ఆయకట్టు రైతులకు సైతం నీరు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments