ఆర్టీఐ ఫిర్యాదు వివరాలు లీక్ చేశారా?
జమ్మికుంట ఎంఈఓ, కోరపల్లి జెడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలి.
జమ్మికుంట, నవంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు):
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా చేసిన ఫిర్యాదు వివరాలు ఇతరులకు ఎలా చేరాయని, ఇందుకు బాధ్యులైన అధికారులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని జమ్మికుంట మండల విద్యార్థి నాయక సంఘం నాయకుడు నల్లగాష హరీష్ యాదవ్ డిమాండ్ చేశారు. జమ్మికుంట మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదుదారుల వివరాల గోప్యతకు భద్రత లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంటలోని కిడ్జీ ప్రైవేట్ పాఠశాలపై ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం కోరపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఫిర్యాదు చేసిన అనంతరం ప్రధానోపాధ్యాయుడు తనకు ఫోన్ చేసి మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఫిర్యాదుపై విచారణ జరపాల్సిన అధికారులు, ఫిర్యాదుదారుడి వివరాలు ఇతరులకు చేరే పరిస్థితి ఎందుకు కల్పించారని నిలదీశారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని, ఆ హక్కును వినియోగించుకున్న వారిపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. జమ్మికుంట ఎంఈఓ కార్యాలయంలో ఫిర్యాదుల వివరాలు ఎలా బయటకు వెళ్లాయి? సీఆర్పీ ద్వారా సమాచారం చేరిందా? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని, విచారణలో బాధ్యత నిర్ధారణ అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట ఎంఈఓతో పాటు కోరపల్లి జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను విచారించి, బాధ్యత నిర్ధారణ అయితే సస్పెండ్ చేయాలని కోరారు. సీఆర్పీ పాత్రపైనా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే తప్పులను ప్రశ్నించే పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఫిర్యాదుదారుల వివరాల గోప్యతను పరిరక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని నల్లగాష హరీష్ యాదవ్ హెచ్చరించారు.


Comments