ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
నవంబర్ నెలాఖరులోగా తొలి విడత రీసర్వే పూర్తి చేయాలి
అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు
అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హనుమకొండ, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో భూముల పునఃసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునఃసర్వేలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటుతో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లోనూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల పునఃసర్వే ప్రక్రియపై దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూముల పునఃసర్వేపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా, మండల స్థాయిలో రెవెన్యూ అంశాలపై సమీక్షలు చేపట్టామని తెలిపారు. పునఃసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి నివేదికలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. సర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, లోపాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

భూముల పునఃసర్వేకు సంబంధించి రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు, సవరణలు చేపట్టాలని తెలిపారు. ఉన్నతాధికారులను సంతృప్తిపరిచే నివేదికల కంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే నివేదికలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూముల పునఃసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు.
మండలాల వారీగా ప్రత్యేక బృందాల ఏర్పాటు
ప్రతి మండలంలో పునఃసర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, అవసరాన్ని బట్టి సర్వే బృందాల సంఖ్యను పెంచాలని సూచించారు. అధికారులు పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేసి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించాలని తెలిపారు.
రైతులకు ముందస్తు సమాచారం.. అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం
పునఃసర్వే చేపట్టే గ్రామాల్లో సంబంధిత రైతులకు ముందుగానే సమాచారం అందించాలని మంత్రి సూచించారు. రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన అవగాహన కల్పించాలని తెలిపారు.
సర్వే నివేదికలపై అభ్యంతరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారనే అంశాలపై ప్రజలకు ముందుగానే వివరించాలని ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో వివరాలను ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.పునఃసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ సంకేతంతో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రికార్డులు కచ్చితంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
అసైన్డ్ భూముల పట్టాలపై క్షుణ్ణంగా పరిశీలన
అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అసలైనవా, నకిలీవా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పట్టా పొందిన వ్యక్తులే ప్రస్తుతం ఆ భూములను అనుభవిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని తెలిపారు. గతంలో ఒకరికి పట్టా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మరొకరు భూమిని అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుత అనుభవదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా కాదా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.పట్టాలో పేర్కొన్న భూమి విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సాగునీటి చెరువులు, రహదారులు, కుంటలు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో భూసేకరణ చేసిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. పునఃసర్వే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
భూముల పునఃసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా సర్వే ప్రక్రియను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. నిర్ణయించిన గడువుకు అనుగుణంగా పునఃసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓలు, భూముల సర్వే సహాయ సంచాలకులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments