కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ సాగునీటి అవసరాలకు కీలక ప్రాజెక్టు.
*అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలి.*
*కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించాలి – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ డిమాండ్.*
కరీంనగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో రాబోయే నీటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. రాబోయే వేసవిలో తాగునీరు, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మానకొండూర్‌లోని జి.వి. రామకృష్ణారావు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులను వచ్చే ఏడాది జూన్ 28 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎందుకు జాప్యం చేసిందని ప్రశ్నించారు.
*ఎన్‌డీఎస్‌ఏ నివేదిక పేరుతో కాలయాపన*
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో కాలయాపన చేసిందని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని, అవసరమైన మరమ్మతులపై నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టాలని ఎన్‌డీఎస్‌ఏ తన తుది నివేదికలో సూచించినప్పటికీ రెండేళ్లపాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
*నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక అవసరం*
నవంబర్ నుంచి జూన్, జూలై వరకు వర్షాలు లేని పరిస్థితుల్లో తెలంగాణలో తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ నాయకత్వం గత ఆరు నెలలుగా హెచ్చరిస్తోందన్నారు. పూర్వ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, నిజామాబాద్ జిల్లాల ప్రజలు, రైతులు నీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
*కన్నెపల్లి వద్ద కాఫర్ డ్యామ్ నిర్మించాలి*
కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద తక్షణమే కాఫర్ డ్యామ్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మట్టి లేదా ఇసుకతో తాత్కాలిక కట్ట నిర్మించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకోవచ్చని, ఇందుకు సుమారు రూ.60 నుంచి రూ.70 కోట్ల వ్యయం అవుతుందని ఇంజనీర్లు సూచించినట్లు తెలిపారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో నింపకుండా సాంకేతికంగా సురక్షితమైన స్థాయిలో నీటిని నిల్వ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు, అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయకసాగర్ ద్వారా హైదరాబాద్‌కు తాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
*తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై గతంలోనే అభ్యంతరాలు*
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే కేంద్ర జల సంఘం ప్రశ్నలు లేవనెత్తిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు సుమారు 116 కిలోమీటర్ల పరిధిలో ప్రాణహిత నదిలో అనేక ఉపనదులు, వాగులు కలుస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలోని నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాలను వినియోగించుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు తప్పనిసరని పేర్కొన్నారు.
*గోదావరిపై ఆరు ప్రాజెక్టుల నిర్మాణం*
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో సుమారు 500 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ ప్రధానంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రమే నిర్మించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, సమ్మక్క–సారక్క, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని వివరించారు. దేవాదుల ప్రాజెక్టుకు సమ్మక్క–సారక్క బ్యారేజీ ద్వారా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం కలిగిందన్నారు.
*రాజకీయాలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం*
కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో ‘కూలేశ్వరం’ అంటూ విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతుల అవసరాన్ని అంగీకరించారని వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత కక్షలకు అతీతంగా తెలంగాణ ప్రజల తాగునీరు, సాగునీటి ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్నారం, సుందిళ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించి, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
“కాళేశ్వరం కూలేశ్వరం కాదు.. తెలంగాణ నీటి అవసరాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఇట్స్ నాట్ కూలేశ్వరం బట్ కాళేశ్వరం” అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రమేష్, పావని గౌడ్, ఆంజనేయులు, నాగి శేఖర్, పలువురు సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments