ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన అవసరం.!
విద్యార్థులకు సూచించిన తహసీల్దార్ రవికుమార్, ఎంఈఓ రాజేశ్వరరావు.
సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యంపై విద్యార్థులు చిన్ననాటి నుంచే అవగాహన కలిగి ఉండాలని సత్తుపల్లి తహసీల్దార్ రవికుమార్, మండల విద్యాశాఖాధికారి రాజేశ్వరరావు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల (ఈఎల్‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వశాంతి విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల పాత్ర, ఓటు హక్కు వినియోగం, ఓటర్ల బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం), ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్), పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ అంశాలపై 50 మార్కులకు వ్యాసరచన, మరో 50 మార్కులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మండలస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో ప్రతిభ కనబరిచి ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాలయ యాజమాన్య ప్రతినిధులు పసుపులేటి నాగేశ్వరరావు, నరుకుల్ల సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు


Comments