అపరాల సాగుకు ప్రోత్సాహంగా రూ.500 బోనస్..
చొప్పదండి సహకార సంఘం నిర్ణయం.
*రైతుల సంక్షేమానికి పాలకవర్గం చొరవ అభినందనీయం: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం.*
చొప్పదండి, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
అపరాల పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ మద్దతు ధరతో పాటు సహకార సంఘం తరఫున క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం తీసుకున్న నిర్ణయం రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అన్నారు. రైతు సంక్షేమం కోసం సహకార సంఘం తీసుకుంటున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక నీటి వినియోగంతో సాగయ్యే వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు.
అంతేకాకుండా రైతులు పండించిన పప్పుధాన్యాలను సహకార సంఘం ద్వారా కొనుగోలు చేసి, వాటిని పప్పులుగా మార్చేందుకు దాల్ మిల్లు ఏర్పాటు చేయాలని పాలకవర్గం తీర్మానించడం విశేషమన్నారు. ఈ విధానం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పప్పుధాన్యాలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతుల ఆర్థికాభివృద్ధి, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహానికి సహకార సంఘం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments