మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
బేతుపల్లి చెరువు ఘటనలో సహాయక సిబ్బందికి మంత్రి పొంగులేటి అభినందనలు.
- ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలకు ప్రత్యేక ప్రశంసలు.
- సమన్వయంతో వ్యవహరించి ప్రాణనష్టం నివారించిన అధికారులకు కితాబు.
- ప్రభుత్వాసుపత్రిలో సహాయక సిబ్బంది, మత్స్యకారులకు పరామర్శ.
- సొంత ఇల్లు లేని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ.
సత్తుపల్లి, నవంబరు 5(తెలంగాణ ముచ్చట్లు):
ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించి, పలువురి ప్రాణాలను కాపాడిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బేతుపల్లి చెరువు వద్ద వరద ఉ
ద్ధృతిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో సిబ్బంది చూపిన తెగువ, సమయస్ఫూర్తి ప్రశంసనీయమని కొనియాడారు. మురసు తుపాను ప్రభావంతో బుధవారం రాత్రి బేతుపల్లి చెరువు అలుగు పొంగి వరద ఉద్ధృతి పెరిగింది. ఈ క్రమంలో మత్స్యకారులను రక్షించే ప్రయత్నంలో పడవ బోల్తాపడటంతో మొత్తం పదకొండు మంది వరదలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద ఉద్ధృతిని సైతం లెక్కచేయకుండా శ్రమించి అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మంత్రి అభినందించారు.
*సిబ్బందికి మంత్రి సత్కారం*
గురువారం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందిని మంత్రి పొంగులేటి పరామర్శించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్‌లతో కలిసి సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాతకొండ ఆరో బెటాలియన్‌కు చెందిన ఆర్ఎస్ఐ మురళి, హెడ్ కానిస్టేబుల్ నరేష్, కానిస్టేబుళ్లు వేణు, బాలాజీ, సీతయ్య, కాశీరాంతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఎస్.కే. యాసిన్ అజ్వల్, ఎన్. రాజా, నాజర్ వలీ, రామిరెడ్డిలను పరామర్శించారు. రాత్రంతా వరద ఉద్ధృతిలో విధులు నిర్వహిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న వారి సేవలను ప్రశంసించారు. సిబ్బందికి శాలువాలు కప్పి సత్కరించి పండ్లు అందజేశారు.
*అధికారుల సమన్వయంతోనే ప్రాణరక్షణ*
ఈ ఘటనను బుధవారం రాత్రే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. గురువారం ఉదయం హెలికాప్టర్ ద్వారా బాధితులను తరలించాలని భావించినప్పటికీ, అధికారుల సమర్థవంతమైన చర్యలతో ఆ అవసరం లేకుండానే అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని తెలిపారు. బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో తాను కూడా వరదలో చిక్కుకున్న వారితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు గుర్తుచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో సొంత ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే, వారు ఏ జిల్లాకు చెందిన వారైనా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆపద సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బందితో పాటు సహకరించిన అన్ని శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Comments