విద్యార్థుల భద్రతే లక్ష్యం.. సైబర్ నేరాలపై పోలీసుల చైతన్యం.
మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ గేమ్స్, సెల్‌ఫోన్ వినియోగంపై అవగాహన సదస్సు.
ఎల్కతుర్తి, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ పాఠశాలలో విద్యార్థుల భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాదకద్రవ్యాల వినియోగం, ఆన్‌లైన్
గేమ్స్, సెల్‌ఫోన్ దుర్వినియోగం, సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శంకర్ ఏఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శంకర్ ఏఎస్ఐ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారకుండా, సెల్‌ఫోన్‌ను అవసరమైన మేరకే వినియోగించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదని, ఎవరితోనూ ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని వివరించారు. ఏదైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. పోలీస్ అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులను చెడు మార్గాల నుంచి దూరంగా ఉంచడంతో పాటు వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్‌తో పాటు పోలీస్ అధికారులు విటల్ రావు, వెంకట్ రెడ్డి, సుప్రియ, పాఠశాల ప్రిన్సిపల్ మర్రి అశోక్, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రె తిరుపతి తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


Comments