హరీష్ రావు సభ విజయంతో కాంగ్రెస్‌లో అసహనం.
అల్వాల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు .
పెద్దమందడి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పర్యటించి, అనంతరం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అల్వాల బీఆర్ఎస్ నాయకుడు వెంకట్ రెడ్డి విమర్శించారు.హరీశ్ రావు పర్యటనకు, బహిరంగ సభకు రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు. రైతుల కష్టాలను తెలుసుకొని వారికి అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.సభ విజయాన్ని చూసి కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని అన్నారు.రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, అల్వాల సభలో లేవనెత్తిన రైతుల సమస్యలకు సమాధానం చెప్పాలని వెంకట్ రెడ్డి కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ నాయకులు కూడా చర్చకు రావాలని సవాల్ విసిరారు.


Comments