నాగిలిగొండలో ఖేతీ బచావో అభియాన్, ఎల్-నినోపై అవగాహన సదస్సు.
ఖమ్మం బ్యూరో , నవంబర్ 4(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్, ఎల్-నినో ప్రభావాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి పి. సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేపూరి పద్మ, వ్యవసాయ విస్తరణ అధికారి, సొసైటీ సీఈఓ, ఆత్మ డైరెక్టర్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పి. సతీష్ మాట్లాడుతూ.. వ్యవసాయ భూములను కాపాడుకోవడమే ఖేతీ బచావో అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అలాగే ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వివరించారు. రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవడంతో పాటు కరువును తట్టుకునే విత్తన రకాలను సాగు చేయాలని, పంటల బీమా చేయించుకోవాలని సూచించారు.
నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గడం వల్ల భూసారం దెబ్బతిని పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. సేంద్రియ కర్బనాన్ని పెంపొందించేందుకు పచ్చిరొట్ట పంటలు, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టును వినియోగించాలని, పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలిపి నేల సారాన్ని కాపాడుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
అనంతరం రైతులు అడిగిన పలు సందేహాలకు వ్యవసాయ అధికారులు సమాధానాలు తెలియజేశారు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ భూసార పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.


Comments