తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
పెద్దమందడి బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం.
పెద్దమందడి,నవంబర్05(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతుకలను పోలీసుల ద్వారా అణచివేసే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. గురువారం ఉదయం పెద్దమందడి మండల పోలీసులు పలువురు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సతీష్ శర్మ, మాజీ మండల కోఆర్డినేటర్ ఖాజా హుస్సేన్, ప్రస్తుత మండల అధ్యక్షుడు వేణు యాదవ్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.ఈ సందర్భంగా స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం లేకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులను ఉపయోగించుకుంటోందని వారు ఆరోపించారు. ఇలాంటి అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు.


Comments