వరద విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికార యంత్రాంగం.

వరద విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న అధికార యంత్రాంగం.

- బేతుపల్లి చెరువు వరదలో మత్స్యకారులు, సహాయక సిబ్బందిని సురక్షితంగా కాపాడిన బృందాలు.
- ప్రాణనష్టం లేకుండా సహాయక చర్యలు.. మంత్రి పొంగులేటి అభినందనలు.
- ఎస్డీఆర్ఎఫ్ బలోపేతంతోనే సత్ఫలితాలు.
- వరద నష్టం అంచనాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సమీక్ష.

సత్తుపల్లి, నవంబరు 5(తెలంగాణ ముచ్చట్లు):

వరద విపత్తు వేళ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి, అన్ని శాఖల సమన్వయంతో ప్రాణనష్టం జరగకుండా చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ప్రాణాలIMG-20261105-WA0024IMG-20261105-WA0022ను సైతం లెక్కచేయకుండా వరదలో చిక్కుకున్న వారిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల సిబ్బంది సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.
గురువారం సత్తుపల్లిలోని సింగరేణి కాలరీస్ గెస్ట్‌హౌస్‌లో బేతుపల్లి చెరువు వరద సహాయక చర్యలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలతో పాటు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సంభవించిన వరదలు, వాటి ప్రభావంపై సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన సహాయక బృందాలు సాహసోపేతంగా విధులు నిర్వర్తించాయన్నారు. బోట్లు బోల్తాపడినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగినప్పటికీ, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి అందరినీ సురక్షితంగా కాపాడటం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి సైతం రెండుసార్లు పరిస్థితిని సమీక్షించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారని వెల్లడించారు.

 *విపత్తుల నిర్వహణలో ఎస్డీఆర్ఎఫ్ కీలక పాత్ర* 

గతంలో మున్నేరు వరదల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విపత్తుల నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసిందని మంత్రి తెలిపారు. పోలీసు శాఖ నుంచి 1,200 మంది, అగ్నిమాపక శాఖ నుంచి 700 మందిని ఎంపిక చేసి మొత్తం 1,900 మందికి ప్రత్యేక శిక్షణ అందించినట్లు వివరించారు. సుమారు రూ.260 నుంచి రూ.270 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ విపత్తు సంభవించినా 45 నుంచి 50 నిమిషాల్లో సహాయక బృందాలు చేరుకునేలా వ్యవస్థను సిద్ధం చేశామన్నారు.
వరదల్లో చిక్కుకున్న వారిని డ్రోన్లు, మొబైల్ లొకేషన్ ట్రేసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించి రక్షించారని తెలిపారు. గత 36 గంటలుగా నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నట్లు చెప్పారు.

 *నష్టంపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి* 

వరదల కారణంగా వ్యవసాయ పంటలు, రహదారులు, చెరువులు, విద్యుత్, సాగునీటి వనరులకు జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. చెరువులు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తెగిపోవడం, వాగులు పొంగిపొర్లడంతో దిగువ ప్రాంతాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. మల్లెపూవు వాగు ప్రవాహంతో దిగువ ప్రాంతాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు.
కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులను గుర్తించాలని సూచించారు. విద్యుత్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలు తమ పరిధిలో జరిగిన నష్టంపై రెండు, మూడు రోజుల్లో సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిలో ఇళ్లు లేని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు.

 *బేతుపల్లి చెరువులో సాహసోపేతంగా రక్షణ చర్యలు* 

ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. బేతుపల్లి చెరువులో వరద ఉధృతి పెరగడంతో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పించగా, 25 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుందని వివరించారు. తొలి బోటు ద్వారా ఈత రాని ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని చెప్పారు. మిగిలిన వారిని రక్షించే క్రమంలో వరద ప్రవాహం పెరగడంతో రెండు బోట్లు అదుపుతప్పి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం నీటిలో పడిపోయారని తెలిపారు. వెంటనే విజయవాడ నుంచి కెప్టెన్ కిరణ్, నీరజ్ నేతృత్వంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి, పోలీసుల సహకారంతో రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చివరకు మత్స్యకారులతో పాటు సహాయక సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగామని పేర్కొన్నారు.

 *వరద బాధితులను కాపాడిన సహాయక బృందాలు* 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ములకలపల్లి సమీపంలో వరదలో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్న 40 ఏళ్ల మహిళను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయని చెప్పారు. అదే ప్రాంతంలో చెట్టుపై చిక్కుకున్న 20 ఏళ్ల యువకుడిని లైఫ్ జాకెట్లు, తాళ్లు, డ్రోన్ సాంకేతికత సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు వివరించారు. ఆలయ దర్శనానికి వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న 11 మంది గిరిజనులను సైతం రక్షించామన్నారు. భారీ వర్షాలతో పంటలు, రహదారులకు నష్టం వాటిల్లిందని, క్షేత్రస్థాయి సర్వే అనంతరం నివేదిక అందజేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ మాట్లాడుతూ.. వరద ముప్పును ముందుగానే అంచనా వేసి ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సత్తుపల్లిలో వరద ఉధృతి పెరిగిన వెంటనే అదనపు బృందాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టామన్నారు. తొలి విడతలో ముగ్గురు మత్స్యకారులను, అనంతరం మరో ఐదుగురిని రక్షించినట్లు వివరించారు. ఉదయం 5.30 గంటల నుంచి రెండో విడత గాలింపు చర్యలు చేపట్టి డ్రోన్లు, ఆధునిక పరికరాలు, మోటార్ బోట్ల సహాయంతో మిగిలిన వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు పూర్తి చేశామన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. ఆకస్మికంగా ఎదురైన వరద విపత్తును అధికారులు, సహాయక బృందాలు సమన్వయంతో, సాహసోపేతంగా ఎదుర్కొని అందరినీ రక్షించారని అభినందించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయడం అభినందనీయమన్నారు.

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీసు, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టం జరగకుండా చూశారని తెలిపారు. వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కోరారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం. భీమదేవరపల్లి మండల కేంద్రంలో అల్పాహార పథకం ప్రారంభం.
భీమదేవరపల్లి, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించేందుకు చేపట్టిన పథకాన్ని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్...
ఆలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు.
బేతుపల్లి చెరువు ఘటన సుఖాంతం.. 16 మంది సురక్షితం.
ముల్కనూర్ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమం ప్రారంభం.
మీ ధైర్యసాహసాలు.. సమయస్ఫూర్తి అభినందనీయం.
తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.
ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరు.