తండ్రి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలకు శ్రీకారం.
వనపర్తి,నవంబర్04(తెలంగాణ ముచ్చట్లు):
దివంగత రామన్ గౌడ్ జ్ఞాపకార్థం ఆయన కుమారులు సమాజ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వనపర్తిలో నిర్వహించిన రామన్ గౌడ్ సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రామన్ గౌడ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చీర్ల జనార్దన్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి నరేందర్, రామ్ రెడ్డి, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చీర్ల నాగేంద్రం తదితరులు మాట్లాడుతూ రామన్ గౌడ్ సేవా గుణం, నిజాయితీ, మంచితనం చిరస్మరణీయమని కొనియాడారు.ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల ద్వారా కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన కుమారులు శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. 9వ వార్డుకు చెందిన ప్రతిభావంతులైన నలుగురు విద్యార్థులకు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేల నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. అలాగే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.తండ్రి చూపిన సేవా మార్గంలో నడుస్తూ సమాజానికి తమ వంతు సహకారం అందిస్తామని కుమారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్, చెన్నయ్య గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, రవి, వెంకటస్వామి, గట్టయ్య, ఈశ్వరయ్య గౌడ్, కుటుంబ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. చివరగా రెండు నిమిషాలు మౌనం పాటించి రామన్ గౌడ్‌కు ఘనంగా నివాళులర్పించారు.


Comments