ప్రమాదకరంగా మారిన ఎస్సీ కాలనీ మూలమలుపు..
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థుల డిమాండ్.
వేలేరు, నవంబర్ 4 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మూలమలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యాన్, కోళ్ల సరఫరా చేసే టాటా ఏసీ వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
గ్రామంలోని ఎస్సీ కాలనీ మూలమలుపు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మలుపు వద్ద వాహనాలు వేగంగా ప్రయాణించడం, తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పాఠశాల వ్యాన్లు, సరుకు రవాణా వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో వేగ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు.
మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎస్సీ కాలనీ మూలమలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని షోడశపల్లి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.


Comments