పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించిన బండి సంజయ్.
463 మంది విద్యార్థులకు రూ.57,875 ఆర్థిక సాయం.
భీమదేవరపల్లి, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 463 మంది విద్యార్థుల పరీక్ష ఫీజుల కోసం మొత్తం రూ.57,875ను స్వయంగా చెల్లించారు.
ఈ విషయానికి సంబంధించిన వివరాలను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రవికి అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో బండి సంజయ్ కుమార్ అందించిన ఈ ఆర్థిక సహాయం విద్యార్థులకు ఎంతో తోడ్పాటుగా నిలవనుంది. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి సర్పంచ్, సిద్ధిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, భీమదేవరపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments