గ్రామాభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు.
అంకుశాపూర్ గ్రామ పాలకవర్గం.
జమ్మికుంట, నవంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామ పాలకవర్గం పనిచేస్తోందని, అభివృద్ధి పనులకు రాజకీయ కక్షలతో అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని అంకుశాపూర్ గ్రామ పాలకవర్గ ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు స్పష్టం చేశారు. గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను కొందరు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటూ, సర్పంచ్, ఉపసర్పంచ్‌లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు.
గ్రామంలోని వివిధ కాలనీల్లో రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టేందుకు గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. నివాస ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో కొండచిలువలు, విషపురుగులు సంచరిస్తున్నాయని, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్లను శుభ్రం చేయించే కార్యక్రమాలు చేపడుతుంటే కొందరు పంచాయతీ సిబ్బందిని బెదిరిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ, కొందరు తమ కుటుంబ సభ్యులు, బంధువులను అడ్డుపెట్టి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని తెలిపారు. ప్రజా అవసరాల కోసం చేపడుతున్న పనులను అడ్డుకోవడం సమంజసం కాదని హితవు పలికారు.
అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములను పరిరక్షించడం గ్రామ పాలకవర్గం బాధ్యత అని, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయా స్థలాలను పేదల ప్రయోజనాలకు ఉపయోగించడంతో పాటు, గ్రామ ప్రజల అవసరాల మేరకు కమ్యూనిటీ హాల్, శివాలయ నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు, దాతల సహకారంతో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
పంచాయతీ సిబ్బంది విధులను అడ్డుకోవడం, దుర్భాషలాడటం, ప్రజాప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించే ప్రయత్నాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఎంపీడీవో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కవిడే కుమారస్వామి, ఉపసర్పంచ్ కడిపికొండ కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు రవీందర్, రమేష్, అనిత, స్వరూప, రవి, సుగుణ, రజిత, మాజీ సర్పంచులు కోమల్ రెడ్డి, శంకర్రావు, సంపత్ రావు, మాజీ ఉపసర్పంచులు నోముల శ్రీనివాస్, చెల్పూరి రాములు, కడిపికొండ తిరుపతిరెడ్డి, అశోక్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.


Comments