వరద నష్టంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
- బాధిత కుటుంబాలకు సండ్ర వెంకటవీరయ్య ఆర్థిక సాయం.
- దెబ్బతిన్న లారీలకు పరిహారం అందించాలని కోరిన మాజీ ఎమ్మెల్యే.
సత్తుపల్లి, నవంబరు 6(తెలంగాణ ముచ్చట్లు):
పట్టణ శివారులోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఆకస్మిక వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించి అండగా నిలిచారు. వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి పది కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, దిండ్లు, దుప్పట్లు, పరుపులు అందజేశారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి రూ.5 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఆకస్మిక వరదలతో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కాలనీ సమీపంలోని లారీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలోనూ వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. సుమారు డెబ్బైకి పైగా లారీల ఇంజిన్లు దెబ్బతినడంతో లారీ యజమానులు భారీగా నష్టపోయారని పేర్కొన్నారు. వారిని కూడా ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం అందించాలని కోరారు. వరదల కారణంగా నష్టపోయిన పేద కుటుంబాలు, లారీ యజమానులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు.


Comments