వనపర్తి షాపింగ్ మాల్స్‌లో కార్మిక చట్టాలు అమలవుతున్నాయా?
ఉద్యోగులకు కనీస వేతనాలు అందుతున్నాయా?
వారాంతపు సెలవులు ఇస్తున్నారా?
నిద్రావస్థలో కార్మిక శాఖ అధికారులు.. క్షేత్రస్థాయి తనిఖీలు ఎప్పుడు?
-- శ్యామ్, జాతీయ మానవ హక్కుల రాష్ట్ర కార్యదర్శి
వనపర్తి,నవంబర్06(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన హక్కులు, సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అనే అంశంపై కార్మిక శాఖ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని జాతీయ మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ కోరారు.పట్టణంలోని చందన బ్రదర్స్, గరుడ, శ్రీ బాలాజీ, కాసం, అన్‌లిమిటెడ్, రిలయన్స్ తదితర షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నారా, నియామక పత్రాలు అందజేస్తున్నారా, నిర్ణీత పని గంటలు పాటిస్తున్నారా, వారాంతపు సెలవులు కల్పిస్తున్నారా అనే విషయాలను అధికారులు పరిశీలించాలని ఆయన సూచించారు.అలాగే ఉద్యోగులకు భవిష్య నిధి, ఉద్యోగుల రాష్ట్ర బీమా వంటి సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. పెద్ద వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనం, చట్టబద్ధమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని పేర్కొన్నారు.కార్మిక శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి షాపింగ్ మాల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని శ్యామ్ విజ్ఞప్తి చేశారు. కార్మిక చట్టాల ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.కార్మికుల హక్కులు, సంక్షేమం పరిరక్షించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వనపర్తి పట్టణంలోని అన్ని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితిపై సమగ్రంగా పరిశీలన జరపాలని జాతీయ మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ డిమాండ్ చేశారు.


Comments