విద్యార్థుల ఆరోగ్యానికి సీఎం అల్పాహార పథకం అండ.
చొప్పదండి జెడ్పీ పాఠశాలలో పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం.
చొప్పదండి, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకానికి చొప్పదండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీకారం చుట్టారు. చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పాఠశాలలో పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం భుజించిన ఎమ్మెల్యే వారితో ముచ్చటించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణించేందుకు పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


Comments