కొత్తకొండ జాతర టెండర్లలో రూ.29.40 లక్షల ఆదాయం.
భీమదేవరపల్లి, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో 2027 జాతర సందర్భంగా నిర్వహించిన టెండర్ కమ్ బహిరంగ వేలం విజయవంతంగా ముగిసింది. పరిశీలకులు శ్రీమతి నందనం కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో వివిధ హక్కులకు సంబంధించి కాంట్రాక్టర్లు పోటీపడి హక్కులను దక్కించుకున్నారు.
వేలంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కును కొత్తకొండకు చెందిన కొక్కర కొండ రాజు రూ.14,61,000కు దక్కించుకున్నారు. గుమ్మడికాయలు, కోరమీసాల విక్రయ హక్కును చెంగల కొమురయ్య రూ.10,47,000కు పొందారు. తలనీలాల సేకరణ హక్కును కొలిపాక కొమురయ్య రూ.17,500కు దక్కించుకున్నారు.
అదేవిధంగా టెంట్‌హౌస్ సరఫరా హక్కును బుర్ర సమ్మయ్య రూ.1,35,000కు, పందిరిలో తడకలు వేసే హక్కును హుస్నాబాద్‌కు చెందిన ములంగూరి చందు రూ.90,000కు, లైటింగ్, డెకరేషన్ హక్కును కొత్తగట్టుకు చెందిన ఉమ్మెత్త నిరంజన్ రెడ్డి రూ.1,90,000కు దక్కించుకున్నారు.
మిగిలిన టెండర్లను ఈ నెల 16వ తేదీ సోమవారం నిర్వహించేందుకు వాయిదా వేసినట్లు దేవస్థాన ఈఓ పి. కిషన్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,పుర ప్రముఖులు, భక్తులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


Comments