జూడో పోటీలను ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్.
క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి.. జిల్లా ఖ్యాతిని చాటాలి.
కరీంనగర్, నవంబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా ఖ్యాతిని నలుదిశలా చాటాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేలో ఇండియాలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో నిర్వహించిన బాలబాలికల జిల్లా స్థాయి సబ్‌జూనియర్ జూడో పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ముఖ్యంగా జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడలు బాలికల ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడాకారులు కోచ్‌ల నుంచి మెళకువలు నేర్చుకొని తమ ప్రతిభను చాటుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జూడో అసోసియేషన్ అధ్యక్షుడు సాధవేణి వినయ్ కుమార్, కార్యదర్శి దామోదర్, ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్, క్రీడా పాఠశాల నిర్వాహకులు, జూడో అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.


Comments