ఇంటింటా పచ్చదనం.. సిరిసేడులో హరిత విప్లవానికి శ్రీకారం!
* ప్రతి ఇంటికీ మొక్కల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం
* సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల - కుమార్
ఇల్లందకుంట, నవంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామాన్ని పచ్చదనంతో నింపుతూ.. ప్రతి ఇంటినీ హరితవనంగా తీర్చిదిద్దే సంకల్పంతో కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో ఇంటింటా మొక్కల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా గురువారం హరితహారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల - కుమార్ మాట్లాడుతూ.. పచ్చదనం అనేది కేవలం గ్రామ అందానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, వాటిని బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించినప్పుడే హరిత లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.
నేడు మనం నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటి ముందు పచ్చదనం వెల్లివిరిసేలా ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల సహకారంతో సిరిసేడు గ్రామాన్ని ఆదర్శ హరిత గ్రామంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఉమ్మగోని రమేష్,గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు


Comments