విద్యార్థుల జీవితాలతో వ్యాపారమా?.. ఫ్రాంక్‌ఫిన్ సంస్థపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం!
-ఉద్యోగాల పేరుతో భారీగా ఫీజుల వసూలు.. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి
– ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్
ఎల్కతుర్తి, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆ సంస్థ ద్వారా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లగా, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ, ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసి, అనంతరం సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజుల రూపంలో చెల్లించినప్పటికీ, విద్యార్థులకు ఆశించిన న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఇలాంటి విద్యాసంస్థల వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. సంస్థపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు వారు చెల్లించిన ఫీజులను తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ప్రణీత్ గౌడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు మాలేబోయిన రామ్ చరణ్, రావుల చరణ్, ఆలేటి సాయి తదితరులు పాల్గొన్నారు.


Comments