కొండచిలువ కలకలం.. ఉలిక్కిపడ్డ స్థానికులు!
పన్నెండు అడుగుల కొండచిలువ పట్టివేత.
సత్తుపల్లి, నవంబరు 7 (తెలంగాణ ముచ్చట్లు):
పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డులో ముళ్ల తీగల ఫ్యాక్టరీ సమీపంలో సుమారు పన్నెండు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి సమయంలో కొండచిలువ కనిపించడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. సుమారు మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ల సమీపంలో ఉన్న పొదల్లో కొండచిలువ సంచరిస్తున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే మట్టా రాగమయి, మున్సిపల్ చైర్‌పర్సన్ రిహన కమల్ పాషా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో అపార్ట్‌మెంట్ల పరిసరాల్లో పేరుకుపోయిన పొదలు, ముళ్లచెట్లను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అప్పట్లో సంచరిస్తున్న కొండచిలువ అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజాగా అదే ముళ్ల తీగల ఫ్యాక్టరీ రోడ్డు పరిసరాల్లో మరోసారి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు రాత్రివేళ స్పందించి కొండచిలువను సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.


Comments