దీపావళి సమాధుల పండుగకు సర్వం సిద్ధం.
నగరంలోని 10 స్మశానవాటికల్లో ఘనంగా ఏర్పాట్లు..
పలు స్మశానవాటికలను పరిశీలించిన మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఆత్మీయుల జ్ఞాపకాలతో జరుపుకునే సంప్రదాయ దీపావళి సమాధుల పండుగకు సర్వం సిద్ధం చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో పూర్వీకుల గౌరవానికి, మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే సమాధుల పండుగ సందర్భంగా శనివారం మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులు, సిబ్బందితో కలిసి వ్యవసాయ మార్కెట్ సమీపంలోని రెండు స్మశానవాటికలతో పాటు వల్లంపహాడ్ స్మశానవాటికను సందర్శించి ఏర్పాట్లను తనిఖీ చేశారు.
స్మశానవాటికల్లో తిరుగుతూ పారిశుధ్య, చదును పనులను పరిశీలించారు. ఏర్పాట్ల విషయంలో పలు సూచనలు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మేయర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


Comments