అంజనగిరి క్షేత్రంలో బీఆర్ఎస్ నేతల ప్రత్యేక పూజలు.
ఖిల్లా ఘనపూర్,నవంబర్07(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలంలోని గట్టుకాడిపల్లి అంజనగిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని శనివారం బీఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.ప్రతి నెల 7వ తేదీన నిర్వహించే ప్రత్యేక దర్శన కార్యక్రమంలో భాగంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అంజనగిరి క్షేత్రంలో ప్రతి నెల 7వ తేదీన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నందున భక్తులు ప్రతి నెలా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ముఖ్యంగా దంపతులు సతీసమేతంగా సంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. భజన కార్యక్రమాల్లో భక్తులు తమ భజన బృందాలతో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి నెల నిర్వహించే ఈ ప్రత్యేక దర్శన కార్యక్రమంలో భక్తుల భాగస్వామ్యం మరింత పెరగాలని, అందరూ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఘనపూర్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, శశివర్ధన్ రెడ్డి, రాజప్రకాశ్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments