ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య
పాకాల చెరువులో విషాదం..
చెరువులో దూకి ముగ్గురి మృతి..
ఘటనపై పోలీసుల దర్యాప్తు
నర్సంపేట డివిజన్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలోని పాకాల చెరువు స్లూయిస్ ప్రాంతంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో గీసుగొండ మండలం ఎల్.కుర్తి హవేలి గ్రామానికి చెందిన ఈరెల్లి మమత (35), ఆమె కుమార్తెలు హారిణి (4), కావ్యశ్రీ (3) మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని చెరువులో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అనంతరం ప్రాథమిక విచారణ చేపట్టి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ముగ్గురి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Comments