ప్రభుత్వ దవాఖానను సందర్శించిన సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా.
వైద్య సేవలు, మందుల నిల్వలపై ఆరా..
ఆసుపత్రి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్
ధర్మసాగర్, నవంబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
మేజర్ గ్రామపంచాయతీ ధర్మసాగర్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానను సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్‌ను కలిసి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు, రోజువారీగా వస్తున్న బహిరంగ వైద్య సేవల రోగుల సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వైద్య సేవల నిర్వహణ, ఆసుపత్రి అవసరాలపై చర్చించారు. ఆసుపత్రికి ఏవైనా అవసరాలు ఉన్నా, సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ముందు భాగంలో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో పాముల సంచారం పెరిగిందని సిబ్బంది సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా యంత్రాన్ని రప్పించి ఆసుపత్రి ముందు భాగంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొట్టే భాను, గాజ శ్యామ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


Comments