మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు.
*నగరపాలక సంస్థ కార్యాలయంలో జయంతి వేడుకలు.*
*విద్యారంగ అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం: మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషి, దేశంలో విద్యా వ్యవస్థ పునాదులను బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని విశ్వసించిన ఆయన, ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కృషి చేశారని తెలిపారు.
దేశ భవిష్యత్తు యువత, విద్యార్థుల చేతుల్లో ఉంటుందని భావించి విద్యారంగ అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పరిశోధన రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని అన్నారు.
మహనీయుల ఆశయాలు, సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యలో రాణిస్తూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments