ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి బలవన్మరణం.
బేతుపల్లి చెరువులో మృతదేహం లభ్యం.
సత్తుపల్లి, నవంబరు 10 (తెలంగాణ ముచ్చట్లు):
ట్రాక్టర్ కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సత్తుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రామనగరం గ్రామ శివారులోని బేతుపల్లి చెరువు కలంగి ప్రాంతంలో కడెం మనోజ్ (20) మృతదేహం సోమవారం వెలుగుచూసింది.
దమ్మపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన కడెం సురేష్ కుమారుడు మనోజ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ట్రాక్టర్ కొనివ్వాలని తండ్రిని కోరుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రస్తుతం కొనివ్వలేనని, వచ్చే ఏడాది కొనిస్తానని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో ఈ నెల ఆరవ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వుకే శివ అనే వ్యక్తి ఫోన్ చేసి బేతుపల్లి చెరువులో మనోజ్ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. ట్రాక్టర్ కొనివ్వలేదనే మనస్తాపంతోనే మనోజ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కుమారుడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు తెలిపారు. కడెం సురేష్ ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి వెల్లడించారు.


Comments