ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.

ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.

*టెండర్ల నుంచి పండుగ ఖర్చుల వరకు ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి*

*పాలకపక్ష ధనదాహానికి మున్సిపాలిటీ ఏటీఎంలా మారింది: కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్*

హుజూరాబాద్, అక్టోబర్ 27(తెలంగాణ ముచ్చట్లు ):

హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చు, టెండర్ల ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయికి అధికారులు, పాలకవర్గం లెక్క చెప్పాలని స్పష్టం చేశారు.
మంగళవారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చు విషయంలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని పాలకవర్గం మున్సిపాలిటీని ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు. ప్రజాధనం ఖర్చుపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ వాటిపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మౌనం వహించడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు, వాటికి కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రావణాసురుడి విగ్రహం ఎత్తుపై అనుమానాలు
దసరా ఉత్సవాల సందర్భంగా 40 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, వాస్తవంగా 30 అడుగుల విగ్రహమే ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని సంతోష్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన వర్క్ ఆర్డర్, ఒప్పంద పత్రాలు, బిల్లుల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ఒప్పందంలో పేర్కొన్న పనులకు, వాస్తవంగా చేసిన పనులకు మధ్య తేడా ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పండుగల ఖర్చుల వివరాలు వెల్లడించాలిసద్దుల బతుకమ్మ, దసరా, వినాయక నిమజ్జనం వేడుకల సందర్భంగా లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఫ్లెక్సీలు తదితర ఏర్పాట్ల కోసం ఎంత మొత్తంలో నిధులు ఖర్చు చేశారో వెల్లడించాలని ఆయన కోరారు. ఈ పనులకు సంబంధించిన అంచనాలు, టెండర్లు, ఒప్పందాలు, బిల్లులు, చెల్లింపుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. పండుగల నిర్వహణ పేరుతో ఖర్చు చేసిన నిధులపై స్పష్టత ఇవ్వడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.
రూ.99 వేల చొప్పున పనుల విభజనపై విచారణ చేయాలి
వినాయక నిమజ్జనానికి సంబంధించిన పనులను టెండర్ నిబంధనల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఒక్కోటి రూ.99 వేల చొప్పున తొమ్మిది పనులుగా విభజించినట్లు ఆరోపణలు ఉన్నాయని సంతోష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ పనుల విభజన వెనుక ఉన్న కారణాలను అధికారులు పరిశీలించాలని, నిబంధనలకు అనుగుణంగానే పనులు కేటాయించారా లేదా అనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ వాహనాల వినియోగంపై ఆరా తీయాలి
కాంట్రాక్టర్ తన సొంత వాహనాలను వినియోగించకుండా మున్సిపాలిటీకి చెందిన జేసీబీలు, డోజర్లను ఉపయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై వాహనాల లాగ్‌బుక్స్, డీజిల్ వినియోగ రికార్డులు, పనులకు సంబంధించిన వివరాలను తనిఖీ చేయాలని అధికారులను కోరారు. మున్సిపల్ వాహనాలను ఏ పనుల కోసం వినియోగించారు? వాటి నిర్వహణ ఖర్చులు ఎవరు భరించారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ప్రజాధనం పరిరక్షణ కోసం పోరాటం
మున్సిపాలిటీ వ్యవహారాలపై నాయకుడు ప్రణవ్ బాబు తన వైఖరిని స్పష్టం చేయాలని సంతోష్ కుమార్ యాదవ్ కోరారు. ప్రజాధనం వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పాలకవర్గం, అధికారులపై ఉందన్నారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడటమే తమ లక్ష్యమని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజాధనాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు పొన్నం శిరీష, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు బండ అశోక్, దిటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...  అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... 
ఖమ్మం బ్యూరో , అక్టోబర్ -27(తెలంగాణ ముచ్చట్లు ) అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు...
ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి.
సేవా భావమే విజయ్‌కుమార్ జీవిత లక్ష్యం.
కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చొరవ.
ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
చిల్పూర్ వెంకన్నకు కానుకల వెల్లువ!