మద్దిగట్లలో మహర్షి వాల్మీకి విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే.
పెద్దమందడి,అక్టోబర్26(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి విగ్రహాన్ని సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన రచించిన రామాయణం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదని, మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే మహాగ్రంథమని అన్నారు. రామాయణం ద్వారా ధర్మం, సత్యం, న్యాయం, కర్తవ్యపాలన, త్యాగం, మానవతా విలువలు తరతరాలకు అందుతున్నాయని తెలిపారు.మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన పట్ల ప్రజలకు ఉన్న గౌరవానికి, ఆయన ఆదర్శాలను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి బోధించిన ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో అందరికీ గౌరవం, సమాన అవకాశాలు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలనే భావనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచించిన రామాయణం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.


Comments