ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి.
- కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే జారె పిలుపు.
- దమ్మపేట మండలంలో ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన.
దమ్మపేట, అక్టోబరు 26(తెలంగాణ ముచ్చట్లు):
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ విధానంలో చేపడుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని సోమవారం దమ్మపేట మండలంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాలరాజుగూడెం, జగ్గారం, అంకంపాలెం, పట్వారిగూడెం, పార్కలగండి గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను సందర్శించి, ఆన్‌లైన్‌లో జరుగుతున్న నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. గ్రామాల వారీగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల ఐక్యత, సమష్టి కృషితోనే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, సీనియర్ నాయకుడు వాసం శ్రీనివాసరావు, సర్పంచులు కుర్సం శ్రీనివాసరావు, వంకా జానకిరాముడు, మోకాళ్ల గురుమూర్తి, మడకం గంగరాజు, కూరం అర్జున్‌రావు, కాంగ్రెస్ నాయకులు బొల్లికొండ నాగేశ్వరరావు, కోర్సా సాగర్, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments