సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి మహిళల కబడ్డీ పోటీలు.
- మూడు రోజుల పాటు క్రీడా సంబరం.. అక్టోబరు 28 నుంచి ప్రారంభం.
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహణ.
- మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు.
- ప్రారంభించనున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి.
సత్తుపల్లి, అక్టోబరు 26 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళా క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంతోపాటు, క్రీడారంగంలో వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు మాజీ టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మువ్వా యూత్ ఆధ్వర్యంలో అక్టోబరు 28, 29, 30 తేదీల్లో 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల వివరాలను తెలియజేసేందుకు సోమవారం సత్తుపల్లిలోని రాణి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతుల మీదుగా పోటీలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు రాణి సెలబ్రేషన్స్‌లో జరిగే ఈ క్రీడా సంబరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా కబడ్డీ జట్లు హాజరుకానున్నాయని పేర్కొన్నారు. కబడ్డీ గ్రామీణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందిన సంప్రదాయ క్రీడ అని, ఈ క్రీడ మహిళల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణతోపాటు జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తుందని మువ్వా విజయబాబు అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో క్రీడారంగంలోనూ వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారిణులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు. క్రీడలతో యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వం పెంపొందుతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు సత్తుపల్లికి క్రీడారంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబరు 28 నుంచి 30 వరకు జరిగే పోటీలను తిలకించేందుకు క్రీడాభిమానులు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని, క్రీడాకారిణులను ప్రోత్సహించి పోటీలను విజయవంతం చేయాలని మువ్వా విజయబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కటికాల క్రిస్టఫర్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,ఖమ్మం జిల్లా కార్యదర్శి, కె. స్వాతిముత్యం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, చి. సుధాకర్ ఖమ్మం జిల్లా సంయుక్త కార్యదర్శి, సత్తుపల్లి పట్టణం ఒకటో వార్డు కౌన్సిల
ర్ మట్టా ప్రసాద్, ఆరో వార్డు కౌన్సిలర్ సుజల రాణి, బేతుపల్లి సర్పంచి దొడ్డా రాజేంద్రప్రసాద్ (అమ్ములు), భీమవరం సర్పంచి వంట్ల రమేష్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, పొంగులేటి, మువ్వా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Comments