నిబంధనలు ఉల్లంఘిస్తున్న రిషి కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.
బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ డిమాండ్.
హైదరాబాద్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
కూకట్‌పల్లిలోని రిషి ఇంజనీరింగ్ కళాశాల, రిషి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారో లేదో సమగ్రంగా విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆడిట్ సెల్, జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బోరెల్లి సురేష్ మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలోని రిషి ఇంజనీరింగ్ కళాశాల, రిషి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలు, ప్రాంగణ నిర్వహణ, విద్యార్థుల భద్రతకు సంబంధించి పలు సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు, సంబంధిత విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా కళాశాలలు నిర్వహిస్తున్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
ఇంజనీరింగ్ కళాశాల, డిగ్రీ కళాశాల ఒకే ప్రాంగణంలో ఒకే ప్రవేశ ద్వారం ద్వారా నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. విద్యార్థులకు అవసరమైన ప్రయోగశాలలు, తరగతి గదులు, ఇతర విద్యా మౌలిక సదుపాయాలు తగిన స్థాయిలో ఉన్నాయా? అర్హత కలిగిన అధ్యాపకులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారా? విద్యార్థుల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేశారా? అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
ఈ నేపథ్యంలో కామన్ ఎంట్రన్స్, ఉమ్మడి ప్రాంగణ నిర్వహణ, ప్రయోగశాలల సౌకర్యాలు, విద్యా మౌలిక వసతులు, అనుబంధ గుర్తింపు నిబంధనలు, అధ్యాపకుల అర్హతలు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై క్షుణ్ణంగా, నిష్పాక్షికంగా తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షితమైన వాతావరణం కల్పించడం విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొంటూ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని బోరెల్లి సురేష్ డిమాండ్ చేశారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.


Comments