పింఛన్ కోసం వృద్ధుల పాట్లు!
ఊరు దాటి వెళ్లాల్సిన దుస్థితి.. రెండేళ్లుగా తప్పని తిప్పలు!
అధికారుల పొరపాటుతో అవస్థలు..
కలెక్టర్ చొరవ కోసం ఎదురుచూపులు
స్టేషన్ ఘన్పూర్,అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన పింఛన్ తీసుకోవడానికి సొంత ఊరు వదిలి పక్క గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి వారిది. వయసు మీదపడి సరిగ్గా నడవలేని పరిస్థితిలోనూ ప్రతి నెలా ప్రయాణాలు చేయాల్సి వస్తుండటంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల పొరపాటుతో రెండేళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న బాధితుల దీనస్థితిపై ‘తెలంగాణ ముచ్చట్లు’ ప్రత్యేక కథనం.
స్టేషన్ ఘన్పూర్ మండలం రంగారాయిగూడెం గ్రామానికి చెందిన 11 మంది పింఛన్ లబ్ధిదారుల పేర్లు పొరపాటున తాటికొండ గ్రామంలో నమోదయ్యాయి. దీంతో మంద వెంకట నర్సయ్య, మంద సమ్మక్క, ఈరగొని ఉప్పలయ్య, బొట్ల ఎల్లమ్మతో పాటు మరో ఏడుగురు లబ్ధిదారులు ప్రతి నెలా పింఛన్ కోసం తాటికొండ గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. తమ సొంత గ్రామంలోనే పింఛన్ అందాల్సి ఉండగా, మరో గ్రామానికి వెళ్లాల్సి రావడం వృద్ధులకు భారంగా మారింది.

పింఛన్ తీసుకోవడానికి వెళ్లి రావడానికి ఒక్కోసారి రూ.200 వరకు ఆటో ఖర్చు అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వృద్ధాప్యంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఈ ప్రయాణ ఖర్చులు అదనపు భారంగా మారాయని వాపోతున్నారు. ప్రభుత్వం అందించే పింఛన్లో కొంత మొత్తం ప్రయాణానికే ఖర్చవుతుండటంతో చేతికి అందే సొమ్ము తగ్గిపోతోందని చెబుతున్నారు.
రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్య!
తమ పేర్లను స్వగ్రామానికి మార్చాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఒక చిన్న పరిపాలనా పొరపాటు కారణంగా ప్రతి నెలా ఇన్ని ఇబ్బందులు పడాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధుల సమస్యను అధికారులు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కలెక్టర్ చొరవ చూపాలి
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమ పేర్లను తాటికొండ నుంచి తిరిగి రంగారాయిగూడెం గ్రామానికి మార్చాలని 11 మంది పింఛన్ లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ స్వగ్రామంలోనే పింఛన్ అందేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వృద్ధుల ఇబ్బందులను గుర్తించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.


Comments