ఘనపూర్‌లో టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.
రూ.12.12 లక్షల విలువైన టపాసులు స్వాధీనం.. ముగ్గురిపై కేసులు
అనుమతులు లేకుండా టపాసుల నిల్వ..
భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో చర్యలు
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో టాస్క్‌ఫోర్స్ బృందం, ఘన్‌పూర్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు నిల్వ చేస్తున్నారనే సమాచారంతో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో శివునిపల్లిలోని బిలిదే సంతోష్ దుకాణంలో రూ.4,08,000 విలువైన టపాసులు, అదే గ్రామంలోని పార్శి యశ్వంత్ దుకాణంలో రూ.5,29,830 విలువైన టపాసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలోని ఆకుల గోపాల్ దుకాణంలో రూ.2,75,000 విలువైన టపాసులను స్వాధీనం చేసుకున్నారు.
మూడు దుకాణాల నుంచి మొత్తం రూ.12,12,830 విలువైన టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
జనావాసాల మధ్య సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా టపాసులను నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా టపాసులను నిల్వ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రత దృష్ట్యా తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


Comments