మహిళల ఆరోగ్యానికి భరోసా.. ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం.
ఇల్లంతకుంటలో శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ దంపతులు.
మానకొండూర్, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక జై శ్రీమన్నారాయణ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ శిబి
రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన సతీమణి, అంకిత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డా. కవ్వంపల్లి అనురాధ ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని ఎం.ఎన్.జే. క్యాన్సర్ ఆసుపత్రి, అంకిత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సమన్వయంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఇల్లంతకుంట మండల మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స పొందేలా అవగాహన కల్పించడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యం.
శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం డా. కవ్వంపల్లి సత్యనారాయణ, డా. కవ్వంపల్లి అనురాధ మహిళలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి పునాది అని పేర్కొంటూ, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ శిబిరంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతోపాటు, వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స పొందేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.


Comments