మహిళల రక్షణ, సైబర్ నేరాలపై విద్యార్థినీలకు అవగాహన.
పెద్దమందడి,నవంబర్10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా షీ టీం ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు మహిళల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ప్రతినిధులు శ్రీశైలం చారి, యాదగిరి రెడ్డి పాల్గొని విద్యార్థినీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, షేర్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసపూరిత పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడా, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం, ఆన్లైన్ ఆటల వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల గురించి వివరించారు.అలాగే బ్యాంకు లావాదేవీలు, ఏటీఎం వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, రహస్య సంకేతాలు వెల్లడించకూడదని విద్యార్థినీలకు సూచించారు.మహిళలు, బాలికలకు ఎలాంటి ఆపద ఎదురైనా, అత్యవసర సహాయం అవసరమైనా 112, 100 నంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. విద్యార్థినీలు తమ వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉంటూ, సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని షీ టీం ప్రతినిధులు సూచించారు.


Comments