భూ రికార్డుల్లో మాయాజాలమా?.. కొనుగోలుదారుడి భూమిపై ఇతరుల పట్టా!
-2009లో కొనుగోలు చేసిన ఎకరం 15 గుంటల భూమికి 2010లో ఇతరుల పేర్లపై పట్టా..
-న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు
ఎల్కతుర్తి, నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
భూమి కొనుగోలు చేసింది ఒకరు.. పట్టా చేసుకున్నది మరొకరు.. అన్నట్లుగా ఎల్కతుర్తి మండలంలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన భూమిని ఇతరులు అక్రమంగా పట్టా చేసుకున్నారని బాధితుడు పోతరబోయిన కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. భూ రికార్డుల్లో జరిగిన మార్పులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
మంగళవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. మండలంలోని భావుపేట శివారులో ఉన్న సర్వే నంబర్ 115లోని భూమికి సంబంధించి తమకు అన్యాయం జరిగిందని తెలిపారు.
దండేపల్లి గ్రామానికి చెందిన భూ యజమాని పొలాటి సీతారామారావు, ఆయన వంశస్థుల నుంచి భావుపేట గ్రామానికి చెందిన పోతరబోయిన కొమురయ్య, పోతరబోయిన కుమారస్వామి, పోతరబోయిన ఐలుమల్లు, వేల్పుల బండ కొమురయ్య, ఎలబోయిన కొమురయ్య, పోతరబోయిన ఐలమల్లు అనే ఆరుగురు వ్యక్తులు మొత్తం ఆరు ఎకరాల 17 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు వివరించారు.
అనంతరం 2009 సంవత్సరంలో వారి వద్ద నుంచి తన భార్య పోతరబోయిన గట్టమ్మ పేరుపై ఎకరం 15 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన పోతరబోయిన శ్రీధర్, పోతరబోయిన కనకలక్ష్మి, పోతరబోయిన రజనీకాంత్‌లు 2010 సంవత్సరంలో సదరు భూమిని తమ పేర్లపై అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆరోపించారు.
తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమి ఇతరుల పేర్లపై ఎలా పట్టా అయిందో అర్థం కావడం లేదని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు భూమి కొనుగోలు పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. తమ భూమికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను బాధితుడు విజ్ఞప్తి చేశారు.


Comments