తప్పుడు పత్రాలు సృష్టించి ఎస్సీ వ్యక్తి భూమిని కబ్జా చేశారని ఆరోపణలు..
న్యాయం చేయాలని బాధితుడి విజ్ఞప్తి.
ఖమ్మం బ్యూరో,నవంబర్ 10(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సొరకాయల చిన్న కృష్ణకు వారసత్వంగా సంక్రమించిన 10 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి కోటేశ్వరరావు ఆక్రమించి, తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చిన్న కృష్ణ ఆరోపించారు.
వివరాల్లోకి వెళితే.. సొరకాయల చిన్న కృష్ణ తండ్రి పెద్ద కోటయ్య 1951లో అదే గ్రామానికి చెందిన శ్రీనాధుని శేషగిరిరావు వద్ద 10 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. అనంతరం 1998లో తన తండ్రి మరణించడంతో అదే భూమిలో అంత్యక్రియలు నిర్వహించి సమాధి ఏర్పాటు చేశారని, 2007లో తన తల్లిని కూడా అదే భూమిలో సమాధి చేసినట్లు తెలిపారు.
కాగా, 2024లో సదరు భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించగా, 2014లో బొడ్డుపల్లి కోటేశ్వరరావు 1960లో భూమి కొనుగోలు చేసినట్లు చూపించే పత్రాలను సృష్టించి, వాటి ఆధారంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్లు తెలిసిందని చిన్న కృష్ణ ఆరోపించారు. అంతేకాకుండా, ఆ పత్రాల్లో పేర్కొన్న 1960 నాటికి కోటేశ్వరరావు వయస్సు కేవలం తొమ్మిదేళ్లు మాత్రమేనని, ఇది పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై బాధితుడు చిన్న కృష్ణ గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించి సివిల్ కేసు దాఖలు చేయడంతో పాటు, సంబంధిత పోలీస్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన తండ్రి కొనుగోలు చేసిన వారసత్వ భూమిని అక్రమ పత్రాల ఆధారంగా స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీసి తనకు న్యాయం చేయాలని సొరకాయల చిన్న కృష్ణ అధికారులను కోరుతున్నారు.


Comments