నిజమైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి.
జిల్లా కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్ వినతి.
వనపర్తి,నవంబరు10(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిజమైన నిరుపేదలకు, ఇల్లు లేని కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వనపర్తి జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ మాట్లాడుతూ, గ్రామాల్లో గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో జీవనం సాగిస్తున్న నిరుపేదలను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.ఇళ్ల మంజూరులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు, ఇతర ప్రభావాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు సమన్వయంతో నిజమైన అర్హులను గుర్తించి న్యాయం చేయాలని పేర్కొన్నారు.అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని పేద కుటుంబాల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందినప్పుడే ప్రభుత్వ పథకం లక్ష్యం నెరవేరుతుందని కొమ్ము చెన్నకేశవులు మాదిగ పేర్కొన్నారు.


Comments