పశువుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు... రైతు వేదికలో అవగాహన కార్యక్రమం.
*పాడి రైతులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలి*
*- జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి*
స్టేషన్ ఘన్ పూర్, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో పాడి రైతులు, గొర్రెల కాపరులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ రావు సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావం పశువుల ఆరోగ్యంపై పడకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు.స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పాడి రైతులు, గొర్రెల కాపరులకు ఎల్నినో ప్రభావం, పాడి పశువుల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మురళీధర్ రావు మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగినప్పుడు పశువులకు రోజంతా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పశువుల పాకలపై ఎండుగడ్డి లేదా తాటాకులు వేసి వేడిని తగ్గించాలని, పాకల చుట్టూ తడి గోనె సంచులు కట్టడం ద్వారా చల్లదనాన్ని పెంచవచ్చని వివరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులకు మేత అందించాలని, దాణాలో ఖనిజ లవణాల మిశ్రమాన్ని కలపడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.రైతులకు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా రైతులకు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మురళీధర్ రావు సూచించారు. గొర్రెలు, మేకలను మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఎండలో మేతకు తీసుకెళ్లకూడదని తెలిపారు. ఉదయాన్నే మేతకు తీసుకెళ్లి, మధ్యాహ్నం వేళల్లో నీడలో ఉంచాలని, సాయంత్రం తిరిగి మేతకు తీసుకెళ్లాలని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక వ్యవసాయ, పశుపోషణ పద్ధతులను పాటించాలని, పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక పశువైద్యులను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు టి. విజయ్ భాస్కర్, సాయి కిరణ్, స్టేషన్ ఘన్ పూర్ మండల అసిస్టెంట్ డైరెక్టర్ డి. సారంగపాణి, మండల పశువైద్యాధికారి బి. మౌనిక, చాగల్లు జెవిఓ రమేష్, మీదికొండ ఎల్ ఎస్ ఏ శ్రీనివాస్, గోపాలమిత్రులు రాజేష్, అయాజ్, భిక్షపతి, రమణాచారి, కార్యాలయ సిబ్బంది వెంకటరాజు, సదానందం తదితరులు పాల్గొన్నారు.


Comments